మూడో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: మూడో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న జరిగే పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం అయిందన్నారు. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు ఏ ఒక్కరు ఇంటింటి ప్రచారం లేదా మీడియాలో ప్రచారం చేయడానికి వీలులేదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి మొదలుకొని పోలింగ్, ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి వరకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 జీపీల్లో సర్పంచ్ స్థానాలు, 806 వార్డులకు గాను ఇప్పటికే చిన్నంబావి మండలంలో గడ్డబస్వాపూర్, పాన్‌గల్ మండలంలో దేవాజిపల్లి, బహదూర్‌గూడెం, పెబ్బేర్ మండలంలో పెంచికలపాడు, రామమ్మపేట, రాంపూర్ గ్రామాల సర్పంచులు, 104 వార్డు మెంబర్లు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 81 సర్పంచ్, 702 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీసీలో ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య భట్టు, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, డీపీఓ రఘుపతిరెడ్డి, తరుణ్ చక్రవర్తి, సీపీఓ హరికృష్ణ పాల్గొన్నారు.


