ఎన్నికలు జరిగే మండలాల్లో సెలవులు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరిగే రోజున ఆయా మండలాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా గురువారం ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాలపేట, ఏదుల, రేవల్లి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు.
ముగిసిన
మూడోవిడత ప్రక్రియ
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మూడోవిడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి ముగిసింది. పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్ మండలాల్లోని మొత్తం 87 సర్పంచ్, 806 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించగా.. 7 సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 80 సర్పంచ్ స్థానాలకు 248 మంది, 702 వార్డులకు 1,734 మంది బరిలో ఉండగా.. ఈ నెల 17న ఎన్నిక జరగనుంది.
సంక్షేమ పథకాలు
వినియోగించుకోవాలి
పాన్‌గల్: దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీపీఎం ప్రభాకర్ కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకులు కూడా అనేక రకాల రుణాలు అందిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో దివ్యాంగులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ఆదర్శంగా నిలిచిన దివ్యాంగుల తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జిల్లా ఏపీఎం రాంబాబు, మండల ఏపీఎం వెంకటేష్‌యాదవ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, సీసీలు, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ బీఎస్సీ (హాన్స్) వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ ఇన్ హార్టికల్చర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత అసలు ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీ, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, పూర్తి బయోడేటాతో ఈ నెల 15న కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
మానవ హక్కులపై
అవగాహన
వనపర్తిటౌన్: ప్రాథమిక హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బుడగజంగాలకాలనీ, నాగవరం, మెట్టుపల్లిలోని పాఠశాల, జూనియర్ కళాశాల, పెబ్బేరులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మావన హక్కులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని పట్టణ, రూరల్ పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, ప్యానెల్ అడ్వొకేట్లు నిరంజన్ బాబా, శిరీష్ చంద్రప్రసాద్, పారా లీగల్ వలంటీర్లు, ప్రిన్సిపాల్ నరేశ్‌కుమార్, న్యాయ కళాశాల విద్యార్థులు, మహిళాసంఘ సభ్యులు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు జరిగే మండలాల్లో సెలవులు


