ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత
● 1050 మంది సిబ్బందితో
మూడంచెల భద్రత
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ సునీతరెడ్డి
వనపర్తి: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని ఎస్పీ డి.సునీతరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని దిశా నిర్దేశం చేశారు. గురువారం పెద్దమందడి, ఖిలాఘనపురం, గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని 87 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అందులో 5 ఏకగ్రీవం కావడంతో 82 గ్రామాల్లోఎన్నికలు జరగనున్నాయని, 1,050 మందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయమే విధుల్లో చేరి ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు జనం గుమిగూడటం పూర్తిగా నిషేదమని, అనుమానాస్పద వ్యక్తులు, చర్యలు గమనిస్తే వెంటనే స్పందించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పికెటింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు, వీడియో రికార్డింగ్ ఉంటాయన్నారు. కేంద్రాల్లోకి పార్టీ చిహ్నాలు, మొబైల్ ఫోన్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడం, ఓటర్లపై ఒత్తిడి తీసుకురావడం, మద్యం, డబ్బుల పంపిణీ చేసినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ప్రకారం విజయోత్సవ ర్యాలీలు నిషేధమని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులుగాని, రాజకీయ పార్టీలనుగాని కించపర్చేలా ప్రచారం చేయొద్దన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ అశోక్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.


