‘పల్లె’ పోరు.. కసరత్తు జోరు!
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం..
● గెలుపు గుర్రాల కోసం వడబోత
● సర్పంచ్ ఆశావహుల
చరిష్మా, సేవలపై ఆరా
● పలు గ్రామాల్లో ముందస్తుగానే
ఇంటింటి ప్రచారం
● గ్రామాల్లో వేడెక్కిన
రాజకీయ వాతావరణం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వనవర్తి: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అదే దూకుడును కొనసాగించేలా నాయకులు ముందస్తు ప్రణాళికతో పోరు బాట పట్టారు. ఇదేక్రమంలో ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం దిశగా నడవాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్.. పంచాయతీ పోరులో విజయం సాధించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా బీజేపీ ముఖ్యులు పక్కా కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు.
● తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలివిడతలో జిల్లాలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, రేవల్లి, గోపాల్‌పేట, ఏదుట మండలాల పరిధిలోని 87 గ్రామపంచాయతీ స్థానాల్లో సర్పంచ్‌లు.. 892 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయా జీపీలను 27 క్లస్టర్లుగా విభజించి నామినేషన్లు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం ఐదు లోపు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఎవరికి వారు వ్యూహాలు..
పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాలకు పదునుబెట్టారు. తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
● ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.
● 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. యూరియా కొరతతోపాటు అరకొర రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఉదహరిస్తూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి తదితర అంశాలతో పాటు తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరించేలా వ్యూహాలను అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది.
● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. గ్రామాలకు అందుతున్న నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అరాచకాలు తమకు కలిసి వస్తుందని.. ఈసారి సత్తా చాటుతామని ‘కమలం’ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అటు, ఇటూ బీసీ కుంపటి..
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కోర్టు అడ్డంకుల నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఖరారు కాగా.. పార్టీ పరంగా 42 శాతం వెనుకబడిన వర్గాలకు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలకు సంబంధించి పార్టీ పరంగా ఉమ్మడి జిల్లాలో ఏయే సర్పంచ్, వార్డు స్థానాలను బీసీలకు కేటాయి స్తామనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో పలు జీపీలకు సంబంధించి జనరల్ స్థానాలపై బీసీ ఆశావహ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు చట్టబద్ధంగా 42 శాతం రిజ ర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడంపై బీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే దుమ్మెత్తిపోస్తు న్నాయి. తాము 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని.. సాధించే దిశగా చర్యలు చేపడతామని.. అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో మీ దారి ఏదని అధికార పార్టీ నేతలు దీటుగా బదులిస్తున్నారు. ఈ లెక్కన పార్టీల్లో బీసీ కుంపటి రాజుకోనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విజయమే లక్ష్యంగా ప్రధాన వ్యూహాలు
పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పదవి కోసం పోటీ పడుతుండడం అధికార కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జీపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పలు ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
‘పల్లె’ పోరు.. కసరత్తు జోరు!


