మీ సమస్యలన్నీ తీరుస్తా
మక్తల్: ‘ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా.’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉన్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నే ళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పా టు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమ స్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ము ంపు గ్రామాలకు సంబంధించిన ఫైళ్లను మూలకు పడేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకా లు, చెక్‌డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్‌పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్‌డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్‌డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు. అదేవిధంగా ముంపునకు గురైన దాదాన్‌పల్లి, అంకెన్‌పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ల ఏరా్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ను వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా పాల్గొన్నారు.


