‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి,
సంబంధిత జిల్లా అధికారులు
వనపర్తి: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రెండో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డి.సునీతరెడ్డి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామన్నారు. మొదటి విడతలో 5 మండలాల్లోని 87 గ్రామపంచాయతీలు, 780 వార్డులకుగాను 30 క్లస్టర్లలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను నియమించి గురువారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. రిజర్వేషన్ల వివరాలు ఇప్పటికే టీ–పోల్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశామని.. ఎఫ్‌ఎస్‌టీ, సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేగాకుండా 4 చెక్‌పోస్టులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఒకమారు శిక్షణ ఇచ్చామని.. మరోమారు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎల్‌పీఓ రఘునాథ్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సమాన అవకాశాలు..
దేశంలోని అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతరెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా పౌరులు తెలుసుకొని రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, డీపీఆర్వో సీతారాం నాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


