‘స్థానికం’లో సత్తా చాటుతాం
వనపర్తి: నియోజకవర్గ నేతలమంతా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి తెలిపారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత తొలిసారి బుధవారం జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, తాజా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు శంకర్‌ప్రసాద్, పసుపుల తిరుపతయ్య, శంకర్‌నాయక్ తదితరులతో కలిసి ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సముద్రంలాంటి కాంగ్రెస్‌పార్టీలో వర్గపోరు, చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజమని.. వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగుతామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. తనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సమావేశంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ధనలక్ష్మి, జనార్దన్, కురు మూర్తి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏకాభిప్రాయంతోనే
అభ్యర్థుల ఎంపిక
వనపర్తి రూరల్: పార్టీ కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక జరగనుందని మాజీ వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. కొన్ని జిల్లాల్లో 3 నుంచి 4 శాతం అమలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూనే.. కాంగ్రెస్‌పార్టీ పాలనలో విఫలమైన విషయాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన మహిళలకు రూ.2,500, రూ.4 వేల ఆసరా పింఛన్లు, రైతులకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, తులం బంగారం, కేసీఆర్ కిట్, ఆటో కార్మికులకు రూ.15 వేలు, నిరుద్యోగ భృతి అమలు కావడం లేదని తెలియజేయాలని కోరారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి, కురుమూర్తియాదవ్, నందిమళ్ల అశోక్, రమేష్‌గౌడ్, మాణిక్యం పాల్గొన్నారు.
‘స్థానికం’లో సత్తా చాటుతాం


