నయనానందం ఉద్దాలోత్సవం
వడ్డెమాన్ నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొస్తున్న ఉద్దాలు
చిన్నచింతకుంట: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్‌లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్‌లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి.
దారులన్నీ కురుమూర్తి వైపే..
కురుమూర్తి జాతరకు మధ్యాహ్నం నుంచి భక్తులు భారీస్థాయిలో తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, బైకులు, ఎద్దుల బండ్లపై భక్తులు జాతరకు చేరుకున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, అమరచింత, కొత్తకోట, చిన్నచింతకుంట దారుల గుండా వేలాది వాహనాలు వచ్చాయి.
బ్రహ్మాండనాయకుడి ప్రధాన వేడుకకు తరలివచ్చిన భక్తజనం
గ్రామగ్రామాన
మంగళ హారతులతో స్వాగతం
జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం
గోవింద నామస్మరణతో
మార్మోగిన కురుమూర్తి గిరులు


