బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం
వనపర్తి: మరో వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు చేపడతామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్‌లో ఆయా మిల్లర్లు వారు పూర్తిచేసిన సీఎంఆర్‌కు అనుగుణంగా నిబంధనల ప్రకారమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈసారి 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం విక్రయానికి వస్తుందని అంచనా వేశామని.. అందులో 80 శాతం సన్న ధాన్యమే ఉంటుందని చెప్పారు. ఎఫ్‌ఏక్యూ ప్రమాణలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ధాన్యం కేటాయింపులు పొందడానికి గతంలో ఉన్న పెండింగ్ పూర్తి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


