సమాజంలో పోలీసుల పాత్ర కీలకం
వనపర్తి: పోలీసుల విధి కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాదని.. సమాజంలో చట్టాలపై అవగాహన పెంపు, శాంతిభద్రతల పరిరక్షణతో ప్రశాంత వాతావరణం నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్‌ను సీఐ కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర వంటి అంశాలను తెలుసుకోవాలని, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత కోసం భరోసా కేంద్రం, షీ టీమ్స్, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసు సిబ్బంది షీటీమ్, భరోసా, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్ డ్రగ్స్, కమ్యూనికేషన్ యూనిట్లకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ పరికరాల వినియోగం, డయల్ 100 సేవలు, ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. జిల్లాకేంద్రంలోని వివిధ విద్యాసంస్థల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాంబాబు, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్‌పర్సన్ చెన్నమ్మ థామస్, షీటీమ్ ఎస్‌ఐ అంజద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్, ఎస్‌ఐలు హరిప్రసాద్, శశిధర్, షీటీం, భరోసా, నార్కోటిక్ డ్రగ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


