బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించగా.. ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా చూడాలని, ఇందుకు పోలీసు అధికారులు, విద్య, వైద్యం, సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రతి నెల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని.. అర్చకులు, కులపెద్దలు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, చేస్తే నమోదు చేసే కేసులు, తదుపరి చర్యలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ తదితర సిబ్బంది సమష్టిగా క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. చదువు మానేసిన బాలికలను గుర్తించాలని, వారితో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మాట్లాడి తిరిగి విద్యాలయాల్లో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. బాల్య వివాహానికి సహకరించే ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామన్నారు. చదువు మధ్యలో మానేసిన ప్రతి బాలికను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి విద్యాలయాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 36 బాల్య వివాహాలను అడ్డుకొని బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ రాంబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సీఐలు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, స్వచ్ఛంద సంస్థల నుంచి చిన్నమ్మ థామస్, మహిళా సంఘాల అధ్యక్షులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.


