‘కపాస్ కిసాన్’లో నమోదు తప్పనిసరి
ఖిల్లాఘనపురం: జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి రైతులు గతంలో మాదిరిగా నేరుగా పత్తి తీసుకొని సీసీఐ కేంద్రాలకు వెళ్లొద్దని.. ఇంటి దగ్గరే ముందుగా కపాస్ కిసాన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇలా చేయడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దని చెప్పారు. జిల్లా రైతులు పత్తి విక్రయానికి అడ్డాకుల దగ్గర ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ మిల్లును ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అలాగే జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట కోతలను చూసి ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్ చైర్మన్ క్యామ రాజు, వివిధ గ్రామాల ఏఈఓలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.


