
పండుగ సంతోషం నింపాలి.. విషాదం కాదు
వనపర్తి: దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. పండుగ ఉత్సాహంలో భద్రతను విస్మరించకుండా.. టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చాలని, రహదారులపై లేదా ఇళ్ల ముందు గుంపులుగా టపాసులు కాల్చవద్దని కోరారు. సింథటిక్ దుస్తులు ధరించకుండా, నూలు దుస్తులు ధరించాలని, టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా వెళ్లాలని, వెలగని వాటిని మళ్లీ ముట్టిచేందుకు ప్రయత్నించకూడదని సూచించారు. నీరు, ఇసుక బకెట్ సమీపంలో ఉంచుకోవాలని, టపాసుల గోదాంలు, విక్రయ కేంద్రాలు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. వెలగని టపాసులను నీటిలో వేయడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. పర్యావరణ హితం కోసం ఎకో ఫ్రెండ్లీ టపాసులు వాడాలని, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 100 లేదా 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీపావళి వెలుగులు మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, అజాగ్రత్త వల్ల చీకటి తెచ్చుకోవద్దని, భద్రతతో పండుగ జరుపుకుంటేనే నిజమైన దీపావళి సార్థకమవుతుందన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్