
గురుకుల స్కూళ్లకు కొమురంభీం పేరు పెట్టాలి
వనపర్తిటౌన్: రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల పేర్లను కొమురంభీం పేరుతో పిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూవాహిని ఉమ్మడి పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబులు చేసిన దోపిడీ, దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించి శ్రీజల్–జంగిల్–జమీన్‌శ్రీ నినాదంతో 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరంభీం త్యాగనిరతి మరువలేమన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడి పేరు, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తుల పేర్లు చరిత్రలో పదిలంగా ఉండటంతో పాటుగా, ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు గిరిజన గురుకులాల పాఠశాలలకు కొమరంభీం పేరు పెట్టాలన్నారు. కొమరంభీం త్యాగ ఫలితాలను పాఠ్య పుస్తకాల్లో పొందిపర్చి భావితరాలకు అందజేయాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొమరంభీం పేరు పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా హిందూవాహిని ఆధ్వర్యంలో నిరసనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అరుణ్‌గౌడ్, కోకన్వీనర్ శ్రీకాంత్, నవీన్, శరత్, రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.