ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు

Oct 20 2025 9:39 AM | Updated on Oct 20 2025 9:39 AM

ఏసీబీ

ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు

మహబూబ్‌నగర్‌ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్‌పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్‌పోస్టులో మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్‌పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్‌పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్‌ చేయకుండా ఆన్‌లైన్‌లో చలాన్స్‌ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్‌పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్‌పోస్టులో సరైన లైటింగ్‌ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్‌ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్‌పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్‌కుమార్‌ విధుల్లో ఉన్నారు. చెక్‌పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు.

నివేదిక అందిస్తాం..

కృష్ణా చెక్‌పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ శ్రీసాక్షిశ్రీకి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్‌పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు.

కృష్ణా ఆర్టీఏ చెక్‌పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు

ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు

తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్‌పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు

ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ

ఒక్కో లారీకి ప్రత్యేక రేటు

కృష్ణా ఆర్టీఏ చెక్‌పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్‌పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్‌ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్‌ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్‌, ఓవర్‌ లోడ్‌ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు.

ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు 1
1/1

ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement