ప్రశాంతం
‘బీసీ’ బంద్
● పోటాపోటీగా బంద్‌లో పాల్గొన్న
రాజకీయ పార్టీలు
● జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బైక్ ర్యాలీ
కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదని, అందుకే కోర్టులో దావా వేస్తారని తెలిసే 42 శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తామని జీఓ ఇచ్చారని బీజీపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆరోపించారు. బీసీ బంద్ కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ రిజర్వేషన్లకు అనుకూలంగానే ఉంటే జనాభా ప్రాతిపదికన రేవంత్‌రెడ్డి కేబినేట్‌లో ఎనిమిది మంది మంత్రులు ఉండాల్సి ఉండగా.. ఎందుకు ముగ్గురే ఉన్నారని ప్రశ్నించారు.
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ శనివారం జిల్లాలో ప్రశాతంగా ముగిసింది. ముక్తకంఠంతో అన్ని బీసీ, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు సైతం బంద్‌లో పాల్గొనటంతో ప్రజలు, వ్యాపారులు, ఆర్టీసీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. సహకారం అందించారు. మధ్యాహ్నం వరకు చిన్నపాటి హోటళ్లు కూడా తెరుచుకోలేదు. మధ్యాహ్నం తర్వాత పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సులు, టీ హోటళ్లు కొనసాగించారు. బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో జిల్లా కేంద్రం నుంచి కొల్లాపూర్, కొత్తకోట, పెబ్బేరు ప్రాంతం వెళ్లే ఉద్యోగులు సొంత వాహనాలతో పాటు ఇతర ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి విధులకు హాజరయ్యారు.
తెల్లవారుజామున 3 గంటల నుంచే..
తెల్లవారుజాము మూడు గంటలకే బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి, బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్‌కు సహకరించాలని అధికారులను కోరారు. డిపో వద్దే ఉదయం తొమ్మిది గంటల వరకు గేట్లు తెరుచుకోనివ్వకుండా నిరసన వ్యక్తం చేశారు.
పోటాపోటీగా..
బంద్‌లో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు సైతం పాల్గొని ఎవరికి వారు వేర్వేరు పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని, బీసీ రిజర్వేషన్ బిల్లును పరోక్షంగా అడ్డుకుంటూనే.. ప్రత్యక్షంగా ప్రజల మధ్య రిజర్వేషన్లకు అనుకూలమనే ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు.
ప్రశాంతం
ప్రశాంతం
ప్రశాంతం


