డబుల్ ఓట్ల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్
వనపర్తి: ఒక వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే గుర్తించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల డీటీలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 2002లో చేసిన ఎస్‌ఐఆర్‌తో 2025 ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్‌స్థాయి అధికారులతో వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. వచ్చే శనివారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
ప్రజావాణి అర్డీఓ కార్యాలయంలో..
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్ ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని.. అర్జీలను అక్కడే అధికారులకు అందించాలని పేర్కొన్నారు.


