వృద్ధులకు ఉచిత న్యాయ సలహాలు
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని
వనపర్తిటౌన్: నిరాశ్రయులైన వృద్ధులు, తల్లిదండ్రులు లీగల్ సర్వీసెస్ క్లినిక్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలనుసారం శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నాల్సా (లీగల్ సర్వీసెస్ టు సీనియర్ సిటిజన్స్) స్కీం–2016 ప్రకారం ప్రతి ట్రిబునల్స్‌లో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ చట్టం, సంక్షేమ చట్టం–2007 ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటకు పంపిన వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని.. పారా లీగల్ వలంటీర్ కొమ్ము వెంకటేశ్ నుంచి ఉచిత న్యాయ సాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఏజీపీ అనంతరాజ్, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, శ్రీదేవి, వలంటీర్ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.


