రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
వనపర్తి: రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా, క్యాన్సర్, హిమోఫీలియా, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర సమయాల్లో రక్తం అవసరమవుతుందన్నారు. ఇలాంటి శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని వారి కోసం ఉపయోగిస్తారని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి ప్రతి ఐదునెలలకు ఓసారి రక్తదానం చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధి నుంచి ప్రజలు, యువత తరలివచ్చి 252 యూనిట్ల రక్తదానం చేశారని వెల్లడించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వనపర్తి సాయుదదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించిన గోర్ల సుమశ్రీ, ఆమె తల్లిదండ్రులను ఎస్పీ శాలువా కప్పి సన్మానించారు.


