బాధితులకు అండగా నిలవాలి
● ఆధునిక సాంకేతికతపై
అవగాహన అవసరం
● ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిస్తూ, వారితో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించగా అధికారులు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించిన అనంతరం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. తర్వాత ఠాణా పరిసరాలు, రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ గదిని పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు, ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయనే వివరాలను ఎస్‌ఐ హరిప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వీపీఓలు రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలన్నారు. బ్లూకోర్ట్, స్టేషన్ రైటర్స్, సెక్షన్ ఇన్‌చార్జ్ పెట్రోకార్స్, రిసెప్షన్‌లాంటి వర్టికల్స్ కచ్చితంగా అమలు చేయాలని, గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. వాహన తనిఖీలు చేపడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ య్య, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, పట్టణ 2వ ఎస్ ఐ శశిధర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.


