
మానసిక ధృడత్వంతోనే మెరుగైన ఫలితాలు
వనపర్తిటౌన్: విద్యార్థులు మానసికంగా ధృడత్వంగా ఉంటేనే చదివిన పాఠాలు గుర్తుంటాయని.. తద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నతస్థాయికి చేరాలంటే మానసిక, శారీరక ధృడత్వం అవసరమని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు టైంటేబుల్ ఏర్పాటు చేసుకొని చదివితే మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారని సైకియాట్రిస్ట్ పుష్పలత సూచించారు. అదేవిధంగా స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రజ్వల సంస్థ ద్వారా ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పోక్సో, మోటారు వెహికల్, బాల్య వివాహాల చట్టాలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హవేలారాణి, సైకాలజిస్ట్ సారా, ఆర్‌ఎంఓ జావిద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.