
బాలికల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
వనపర్తి: బాలికల ఎదుగుదల, అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి, కలెక్టర్ తల్లి నర్సమ్మ తెలిపారు. శుక్రవారం మర్రికుంట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన ‘స్పూర్తి’ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేసి బాల్య వివాహాలకు తావు ఇవ్వొద్దని.. ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. తద్వారా సమాజంలో తమ కాళ్లపై తాము నిలబడటానికి అవకాశం ఉంటుందన్నారు. అమ్మాయిలు సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం నర్సమ్మను శాలువాతో సత్కరించారు.
రామన్‌పాడులో
తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం సముద్రమట్టానికి పైన 1018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
14న తెలంగాణ బంద్
వనపర్తిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆరవింద్‌స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జాతీయ బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం స్టే విధించడం దేశచరిత్రలోనే మొదటిసారని, ఇది బీసీలకు అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘాల నాయకులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు, ఉపాధ్యక్షుడు చిట్యాల రాములు, చిన్నంబావి మండల అధ్యక్షుడు రామకృష్ణ, లోకేష్ పాల్గొన్నారు.
నేటి నుంచి
ఆరాధనోత్సవాలు
అమరచింత: మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో ఉన్న దేవేంద్రచార్యుల మఠంలో శనివారం నుంచి మూడురోజుల పాటు ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకుడు నర్సింహచారి శుక్రవారం తెలిపారు. ఏటా స్వామివారి ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేవేంద్రాచార్యులు భక్తుల సమక్షంలో 1952లో జీవ సమాధి అయ్యారని.. నాటి నుంచి మఠంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరాధనోత్సవాలకు శ్రీ గాయత్రీ పీఠం పీఠాధిపతి డా. శ్రీకాంతేంద్రస్వామి హాజరవుతున్నట్లు వివరించారు. రోజువారీ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
కార్యక్రమాల వివరాలిలా..
శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు గంగా తీర్థ సేకరణతో ఆరాధనోత్సవాలు ప్రారంభం. 12న మహా చండీయాగం, రుద్రాభిషేకం, రాత్రి అఖండ భజన, 13న స్వామివారి ఉరేగింపు, డోలోత్సవం, అన్నప్రసాద వితరణ.