
రాయితీ.. అనాసక్తి !
సబ్సిడీపై వ్యవసాయ యంత్ర సామగ్రి పంపిణీకి శ్రీకారం
వనపర్తి: సుమారు పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాయితీలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయి. ఆరు నెలల కిందటే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా.. యంత్ర సామగ్రి ధరలు మారడం, జీఎస్టీ స్లాబ్‌లు, దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చోటు చేసుకోవడంతో మరోమారు ఆగస్టు 4 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయశాఖ అనుమతినిచ్చింది. అయినా రైతుల నుంచి ఆశించిన మేర స్పందన లేదని తెలుస్తోంది. జిల్లా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు రూ.1.50 కోట్లు కేటాయించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. రూ.77.13 లక్షలు మంజూరు చేసింది. రాయితీ పరికరాల కోసం రైతులు ఎదురుచూస్తున్నా.. చాలాకాలం పాటు పథకం నిలిచిపోవడం, ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ప్రారంభించినా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో ఆశించిన మేర వేగం పుంజుకోవడం లేదు.
జిల్లాలో 2.80 లక్షల ఎకరాల సాగు..
జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులుండగా.. అందులో 65 శాతం చిన్న, సన్నకారు రైతులే. ఈ ఏడాది అత్యధికంగా 2.30 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి సాగుకాగా.. మరో 50 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. కాగా జిల్లాకు కేవలం 894 రాయితీ యూనిట్లు కేటాయించడం కొంత చిన్నచూపనే చెప్పాలి.
రాయితీ ఇలా..
వ్యవసాయ యంత్ర పరిసరాలు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీపై అందించాలని ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. యూనిట్ విలువలో రాయితీ మొత్తం మినహా.. మిగతా డబ్బును రైతు డీడీ రూపంలో వ్యవసాయశాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
అందుబాటులోకి రాని యాప్..
రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెప్పినా.. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో స్థానిక అధికారులు ఈ ప్రక్రియపై ఏ చేయాలనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరు వరకు యంత్ర సామగ్రి అందడం కష్టమేనన్న వాదన రైతుల నుంచి వినిపిస్తోంది.
జిల్లాకు రూ.77.13 లక్షలు కేటాయింపు
894 యూనిట్లు ఇచ్చేందుకు అధికారుల ప్రణాళికలు
క్షేత్రస్థాయిలో కనిపించని అవగాహన కార్యక్రమాలు
ఆశించిన మేరఅందని దరఖాస్తులు