
క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు కృషి
● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి విద్యావిభాగం: విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లాను ఇకపై క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–14, అండర్–17 బాల, బాలికల కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. జిల్లాలోని 15 మండలాల నుంచి 730 మంది క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చడం గర్వకారణమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓడిన క్రీడాకారులు పట్టుదలతో గెలుపునకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు, జిమ్, స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి రూ.15 కోట్లు, క్రీడా పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. విద్యతో పాటు క్రీడలపై దృష్టి సారించి దేశ విదేశాల్లో జిల్లా ప్రతిభను చాటాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.