
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి..
శాంతిభద్రతల పర్యవేక్షణకు..
వనపర్తి: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.
● జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని.. మొత్తం ప్రయాణికుల్లో 64.28 శాతం మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా రూ.97.54 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. 85 వేల మందికి 2,34,879 గ్యాస్ సిలిండర్లు రూ.500కే పంపిణీ చేశామని.. దీనికిగాను ప్రభుత్వం రూ.6.56 కోట్ల రాయితీ అందించిందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకుగాను మహిళాశక్తి పథకంలో భాగంగా 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను మంజూరు చేశామని.. వీటి ద్వారా ప్రతి సమాఖ్యకు నెలకు సుమారు రూ.69 వేల ఆదాయం వస్తుందని చెప్పారు.
కొత్త రేషన్ కార్డుల జారీ..
జిల్లాలో ఇప్పటి వరకు 17,490 కొత్త రేషన్ కార్డులను జారీ చేయగా.. 45,576 మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. అలాగే ప్రస్తుత కార్డుల్లో కొత్తగా 29,858 మందిని చేర్చినట్లు వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని.. జిల్లాలో 2024, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్లలోపు విద్యుత్ అందిస్తున్నామని.. జిల్లాలో ఇప్పటి వరకు 82,708 కుటుంబాలకు సంబంధించి రూ.30.48 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. అదేవిధంగా కొత్తగా 33 కేవీ సామర్థ్యం గల 29 ఉప కేంద్రాలు రూ.45.43 కోట్లతో నిర్మిస్తున్నామని.. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం..
పేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,173 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయగా.. 3,731 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తంగా రూ.26.73 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
రైతుభరోసా..
రైతును రాజు చేసేందుకు రైతుభరోసా, పంట రుణమాఫీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్‌లో 1,75,869 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.205 కోట్ల 93 లక్షల 79 వేలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా పథకంలో భాగంగా 2024–25 సంవత్సరానికిగాను 681 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.34.05 కోట్లు చెల్లించినట్లు వివరించారు. పంట రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 4 విడతల్లో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు చెప్పారు.
జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న
శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యే తూడి
మేఘారెడ్డి తదితరులు
జిల్లా ప్రగతి నివేదిక
చదువుతున్న శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
భూ సమస్యల పరిష్కారానికే
భూ భారతి
ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందని.. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 1,943 దరఖాస్తులు రాగా.. 1,207 పరిష్కరించామని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనను అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని.. వనపర్తి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానించి నేరాలను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. సఖి, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తున్నామని.. సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను అరికడుతున్నట్లు వివరించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రత్యేక పోలీస్ బృందం నిఘా ఉంటుందని.. మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నందుకు జిల్లా పోలీస్‌శాఖను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు