
విశ్వకర్మలు అన్నిరంగాల్లో రాణించాలి : ఎస్పీ
వనపర్తి: విశ్వకర్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనను ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానించి పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ మనుగడలో విశ్వకర్మల చేతివృత్తులు ప్రధాన భూమిక పోషించాయని, యాంత్రిక ప్రపంచీకరణ నేపథ్యంలో కులవృత్తులకు ప్రాధాన్యం తగ్గి జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. సమస్యలను అధిగమించాలంటే తమ పిల్లలు గొప్పగా చదువుకునేందుకు ప్రోత్సహించాలని, అంతేగాక తాము సంపాదించిన సొమ్మును భూమి కొనుగోలుకు వెచ్చించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంస్కారవంతమైన జీవనాన్ని సాగించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ, స్వర్ణకార సంఘం, బులియన్ మర్చంట్ ప్రతినిధులు ఎస్పీని సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన కళాకారులు, దేవాలయ, విశ్వబ్రాహ్మణ అభివృద్ధికి కృషిచేసిన వారిని ఎస్పీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో డా. పోతేదారు యాదాచారి, దర్శనోజు సత్యనారాయణ, వేణు, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, బైరోజు చంద్రశేఖర్, డా. శ్యాంసుందర్, కొండోజు గోపినాథ్, నారాయణదాసు గోవర్ధనాచారి, చెన్నయ్యచారి, వీరాచారి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
నిండుకుండలా
రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు.
ప్రైవేట్‌కు ధీటుగా
ఉత్తీర్ణత సాధించాలి
ఆత్మకూర్: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు బాగా చదివి ప్రైవేట్‌కు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని, దేశం గర్వించేస్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, గురువులు, తమ ఊరికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య ఆకాంక్షించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్‌డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరగా డీఐఈఓను కళాశాల అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాగ్యవర్ధన్‌రెడ్డి, టీజే విశ్వేశ్వర్, జమ్మన్న, రాఘవేందర్‌రావు, శ్వేత, వీణ, లలితమ్మ, ఏకే కురుమూర్తి, చైతన్యరాణి, పావని, సునీల్‌రెడ్డి, రాఘవేంద్ర, రామన్‌గౌడ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం మేళాకు ముగ్గురు ఎంపిక
పాన్‌గల్: జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాలో మండల విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికై నట్లు ఎంఈఓ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో గోప్లాపూర్ యూపీఎస్ విద్యార్థి కార్తీక్ ప్రథమ బహుమతి, ఇంగ్లీష్ విభాగంలో బుసిరెడ్డిపల్లి పీఎస్ విద్యార్థి శిరీష ద్వితీయ బహుమతి, గణిత విభాగంలో వెంగళాయిపల్లి పీఎస్ విద్యార్థి రాణి ద్వితీయ బహుమతి సాధించినట్లు పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు, ఉపాధ్యాయులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం మేళాలో పాల్గొంటారని చెప్పారు.

విశ్వకర్మలు అన్నిరంగాల్లో రాణించాలి : ఎస్పీ

విశ్వకర్మలు అన్నిరంగాల్లో రాణించాలి : ఎస్పీ