
ఆరోగ్య మహిళ.. ప్రభుత్వ ధ్యేయం
● ‘స్వస్త్ నారి.. సశక్త్ పరివార్ అభియాన్’ ప్రారంభం
● సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు
ఖిల్లాఘనపురం: దేశంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి కుటుంబం బాగుంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం మండల కేంద్రంలోని సీఎస్‌సీ ఆవరణలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అక్కడికి వచ్చిన మహిళలు, బాలికలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే శక్తి మహిళకే ఉంటుందని, అలాంటి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ 2 వరకు పుట్టిన బిడ్డ నుంచి అన్ని వయసుల మహిళలకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేక వైద్య నిపుణులు వచ్చి మహిళలకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని.. అన్ని విద్యాలయాలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
జిల్లాకేంద్రంలో సీటీ స్కాన్ సెంటర్..
ఎంపీ మల్లు రవి చొరవతో యూనియన్ బ్యాంక్ సహకారంతో జిల్లాకేంద్రంలో రూ.2.50 కోట్లతో సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వైద్య శిబిరంలో 12 రోజుల పాటు క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు, దంత, క్షయ, మధుమేహం తదితర వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
● ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను మండలంలోని సోళీపురంలో 6 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, మండల వైద్యులు డా. చైతన్య, ఆస్పత్రి సూపరింటెండెంట్, మండల సింగిల్‌విండో చైర్మన్ మురళీధర్‌రెడ్డి, డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పోషణ మాసం ప్రారంభం
మండల కేంద్రంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసం చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. త్వరలోనే మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.