
సమన్వయంతోనే సమస్యల పరిష్కారం
వనపర్తి: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపురం మండలాలకు సంబంధించిన సమస్యలపై కలెక్టర్ ఆదర్శ్ సురభి సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తకోట మండలానికి చెందిన పలువురు విద్యుత్ అంతరాయం, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా, మున్సిపల్ కాంప్లెక్స్ భవనం ఏర్పాటు, సంతకు స్థలం కేటాయింపు తదితర సమస్యలను వారికి వివరించారు. వెంకటగిరి ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మించాలన్నారు. మదనాపురంలో బస్టాండ్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలని మండలవాసులు కోరారు. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీలు, తాగునీటి సమస్య వేధిస్తోందని.. పరిష్కరించాలని సూచించారు. దుప్పల్లిలో పశు వైద్యశాల, గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ.. వెంకటగిరి ఆలయానికి రహదారి, వారాంతపు సంత నిర్వహణకు స్థలం కేటాయింపునకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. విద్యుత్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కలెక్టర్‌ను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకొని పనులు ప్రారంభించని లబ్ధిదారులతో త్వరగా మొదలు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. చిన్న చిన్న కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని.. పరిష్కరించాలని కోరారు. కొత్తకోటలో ఆడిటోరియం అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా చొరవ తీసుకుంటున్నందుకు కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కానాయిపల్లి ఆర్‌అండ్‌ఆర్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అత్యధికంగా 72 శాతానికిపైగా కొత్తకోట మండలంలో జరిగిందని ఇది మంచి పరిణామమన్నారు. కొత్తకోటలో ఆడిటోరియం అప్రోచ్ రోడ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1912ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా మదనాపురం మండల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, కొత్తకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, కతలప్ప, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

సమన్వయంతోనే సమస్యల పరిష్కారం