
ఐక్యతతోనే అభ్యున్నతి సాధ్యం
రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్
కార్పొరేషన్ చైర్మన్
దీపక్ జాన్ కొక్కడన్
వనపర్తి: క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండి అభ్యున్నతి సాధించాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనానన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పాస్టర్లు, క్రిస్టియన్ మతపెద్దలతో నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. జిల్లాలోని క్రిస్టియన్లు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్‌జాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం కొనసాగుతోందని, అన్ని కులాలను సమానంగా ఆదరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెంకటాపూర్‌లో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అన్ని మండలాలు, గ్రామాల్లో క్రైస్తవుల సమాధులకు స్థలం కేటాయించాలని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. క్రైస్తవులకు బీసీ(సీ) కుల ధ్రువీకరణపత్రం జారీ విషయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాధుల కోసం జిల్లాకేంద్రంలో ఇప్పటికే 2 ఎకరాల స్థలం కేటాయించామని.. ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ స్థలంలో గుట్టలు, రాళ్లు ఉన్నందున చదును, మౌలిక వసతుల కల్పనకు మరో రూ.30 లక్షల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమడబాకులతండాలో క్రైస్తవ ప్రార్థనా మందిరానికి అనుమతి ఇచ్చామని.. వెంకటాపూర్‌లో సమస్య తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారని, కుల ధ్రువీకరణ పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వివక్షకు గురవుతున్నామన్నారు. జెరూసలేం యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు. క్రైస్తవులు తమ ఇళ్లలో ప్రార్థనలు చేసుకునే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్ పాల్గొన్నారు.