
మహిళల కోసం మెగా వైద్య శిబిరం
ఖిల్లాఘనపురం: ‘స్వస్త్ నారి.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం సీహెచ్‌సీని, వైద్య శిబిరం నిర్వహణ ఏర్పాట్లను స్థానిక వైద్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లావ్యాప్తంగా 98 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి మహిళలకు వైద్యసేవలు అందించనున్నట్లు చెప్పారు. శిబిరాల్లో 19 మంది ప్రత్యేక వైద్య నిపుణులు, మండల వైద్యులు, సిబ్బంది పాల్గొంటారన్నారు.