
విద్యతోనే సమస్యల పరిష్కారం : డీఐఈఓ
పాన్‌గల్: విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతోందని.. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) అంజయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు హైదరాబాద్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వారు రూ.1.80 లక్షల విలువైన తాగునీటి సీసాలు, రాత పుస్తకాలు, రెండు బీరువాలు, ప్రింటర్, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఆస్పత్రి యాజమాన్యం కళాశాలకు సామగ్రి అందించడం అభినందించదగిన విషయమన్నారు. ఇంటర్ విద్య విద్యార్థికి పునాది లాంటిదని.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా అధ్యాపకులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుమల్‌రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.