
‘విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించరా?’
వనపర్తిటౌన్: తాము అధికారంలోకి వస్తే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతోన్మాద ఎంఐఎంకు భయపడి పార్టీ కార్యాలయాల్లో తప్ప అధికారికంగా జరగడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు హైదరాబాద్ సంస్థానం నిజాం రాజులు తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించకుండా, జాతీయ నినాదం, జెండాను ఎరగనివ్వకుండా, ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు యత్నించారని చెప్పారు. నాటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లబ్‌భాయ్‌పటేల్ ఆపరేషన్ పోలో సైనిక చర్యతో నిజాంలు లొంగారని.. 1948, సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. పెద్దిరాజు, కుమారస్వామి, గజరాజుల తిరుమల్లేష్, రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.