
అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం
అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
స్మరించుకోని పాలకులు..
నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం.