
నేరాల నియంత్రణలో ఉపాధ్యాయులది కీలక పాత్ర
వనపర్తి: సమాజంలో చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో ఉపాధ్యాయులది కీలకపాత్రని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్‌శాఖ తరఫున ఉపాధ్యాయులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని, థర్డ్ పేరెంట్‌గా వ్యవహరించాలని, ఎల్లప్పుడూ వారిపై దృష్టి సారించి తప్పుడు మార్గంలో పయనించకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే హెల్ప్‌లైన్ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించాలన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఉత్తమ వనపర్తి నిర్మాణానికి సహకరించాలని కోరారు. జిల్లాలో అనేక విషయాల్లో కలెక్టర్ సహకారం పోలీస్‌శాఖకు అందుతుందని.. ఈ ఏడాది సైబర్ నేరాలను కూడా గణనీయంగా తగ్గించగలిగామని, ఇప్పుడు పోక్సో కేసులను కూడా తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చట్టాలపై ఉపాధ్యాయులకు ఉన్న సందేహాలను ఎస్పీ నివృత్తి చేశారు. పొక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన స్కిట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీసీపీఓ రాంబాబు, చైల్డ్ చాప్టర్ ఎన్జీవో సంస్థ అధినేత జాకీర్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.