
నగదు కేంద్రాలుగా.. రేషన్ దుకాణాలు
● లబ్ధిదారు
వేలిముద్ర
వేయించుకొని నగదు చెల్లిస్తున్న వైనం
● అవే బియ్యం మిల్లులకు తరలింపు
● మెజార్టీ దుకాణాల్లో ఇదే తంతు..
సన్నబియ్యం కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్న డీలర్లు
వనపర్తి: ఏళ్లుగా రీసైక్లింగ్‌కు అలవాటుపడిన మిల్లర్లు ఏటా కొత్తదారులు వెదుక్కుంటున్నారు. గతంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఇల్లిల్లూ తిరిగి రేషన్ బియ్యం సేకరించి మిల్లులకు తరలించి ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో నింపి సీఎంఆర్ పేరున తిరిగి అప్పగించేవారు. టాస్క్‌ఫోర్స్, పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారుల పర్యవేక్షణ పెరగడంతో తమ పంథా మార్చుకున్నారు. గుట్టుగా రీసైక్లింగ్ దందా కొనసాగించేందుకు మిల్లర్లు లబ్ధిదారులను వదిలేసి అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు రేషన్ డీలర్లను ఎంచుకున్నారు. వీరు లబ్ధిదారుల వద్ద వేలిముద్ర వేయించుకొని కిలో బియ్యం రూ.16కు కొనుగోలు చేసి నేరుగా దుకాణం నుంచి మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ దందా గుట్టుగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల మూడునెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సమయంలో పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దుకాణల ద్వారా మిల్లులకు చేరినట్లు తెలుస్తోంది. తాజాగా వారం నుంచి జిల్లాలో బియ్యం పంపిణీ ప్రారంభమైన విషయం విధితమే. దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు కిలో రూ.9 ప్రకారం లబ్ధిదారుల నుంచి డీలర్లు కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించేవారు. ప్రస్తుతం సన్న బియ్యం సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి కిలో రూ.16 లెక్కన లబ్ధిదారు నుంచి కొని రూ.ఒకటి, రూ.రెండు అదనపు రేటుతో మిల్లర్లకు డీలర్లు విక్రయించి రీసైక్లింగ్‌కు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 5.23 లక్షల మంది లబ్ధిదారులు..
జిల్లాలోని 268 గ్రామపంచాయతీలు, ఐదు పురపాలికల పరిధిలో 324 రేషన్ దుకాణాలుండగా.. సుమారు 5.23 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల నుంచి పెద్దమొత్తంలో బియ్యం రీసైక్లింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సన్నబియ్యం పంపిణీ తర్వాత వినియోగం స్వల్పంగా పెరిగినా.. రీసైక్లింగ్ మాత్రం ఆగటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎఫ్‌సీఐ అంటే జంకు..
జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులు పొందిన మిల్లర్లలో కొందరు ఎఫ్‌సీఐకి అందించేందుకు జంకుతున్నారు. ఇందుకు కారణం ఎఫ్‌సీఐ గోదాం వద్ద ఉంటే టీఏలు నిబంధనలు పక్కాగా పాటిస్తారని.. ఏ మాత్రం తేడా ఉన్నా తిప్పి పంపుతారు. ఒక్క లారీ తిప్పిపంపితే రూ.వేలల్లో నష్టం వస్తోంది. దీంతో ఎక్కువగా సీఎస్‌సీ (రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పౌరసరఫరాలశాఖ)కు బియ్యం ఇవ్వడానికి మొగ్గుచూపుతారు.
చక్రం తిప్పుతున్న టీఏలు..
రేషన్ డీలర్లు, లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యం సీఎంఆర్‌గా సీఎస్‌సీ (సివిల్ సప్లయ్ కార్పొరేషన్)కి అప్పగించే సమయంలో మిల్లర్లు చేసే మాయాజాలాన్ని గుర్తించడం సాంకేతిక సహాయకుల(టీఏ)కు సులభం. కానీ వారిచ్చే కానుకలకు తలొగ్గి అనుమతిస్తుండటంతో మిల్లర్ల రీసైక్లింగ్ దందా యథేచ్ఛగా సాగుతోందని చెప్పవచ్చు.
పర్యవేక్షణ పెంచుతాం..
రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై పర్యవేక్షణ పెంచుతాం. రేషన్ దుకాణాల్లో వేలిముద్ర వేయించుకొని బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చినట్లు నిర్ధారణ అయితే చర్యలు కఠినంగా ఉంటాయి. ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ఉదారంగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే విక్రయించడం సరికాదు. లబ్ధిదారులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వినియోగించుకోవాలిగాని డబ్బులకు విక్రయించవద్దు. – ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్

నగదు కేంద్రాలుగా.. రేషన్ దుకాణాలు

నగదు కేంద్రాలుగా.. రేషన్ దుకాణాలు