గుట్టుగా మట్టిదందా! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా మట్టిదందా!

Sep 1 2025 2:19 AM | Updated on Sep 1 2025 2:19 AM

గుట్ట

గుట్టుగా మట్టిదందా!

రోజురోజుకు కరుగుతున్న వనపర్తి శివారు గుట్టలు

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో..

దాడులు నిర్వహిస్తాం..

సెలవు రోజుల్లో అక్రమ రవాణాకు తెరతీసిన వైనం

చూసీచూడనట్లు

వ్యవహరిస్తున్న అధికారులు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల చాటున తరలింపు

వనపర్తి: ‘ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులం.. కాబోయే ప్రజాప్రతినిధులం..’ అంటూ పలువురు జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీనివాసపురం, రాజనగరం శివారులోని గుట్టలను గుట్టుగా తవ్వి మట్టిని అక్రమంగా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అధికారపార్టీ నేతల అండదండలతో అధికారులు అందుబాటులో లేని సెలవు రోజుల్లో మట్టిదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని తరలిస్తున్నారు. సెలవు వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి చీకటి పడే వరకు మట్టి దందా చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్థానికంగా విధులు నిర్వహించాల్సిన మైనింగ్‌శాఖ ఏడీని రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అదనపు బాధ్యతల పేరుతో పంపించడంతో జిల్లాలో మట్టిదందాకు తెరతీసినట్లయిందన్న విమర్శలు ఉన్నాయి.

● ఆగస్టు 27 వినాయక చవితి సెలవు రోజున రాజనగరం సమీపంలోని ఓ గుట్టపై, అదే గ్రామానికి చెందిన కొండలయ్య గుట్టపై నాగవరం తండాకు చెందిన పొక్లెయిన్‌ ఏర్పాటు చేసుకొని మట్టిని జిల్లాకేంద్రానికి తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు పలువురు ఫిర్యాదులు అందినా వారు స్పందించలేదు. దీంతో వారు ఆదివారం కూడా మట్టి తరలింపు యథేచ్ఛగా చేసినట్లు సమాచారం.

● శ్రీనివాసపురం శివారులోని మబ్బుగుట్ట ఇరువైపులా.. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పలువురు, మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన మరికొందరు వేర్వేరు చోట్ల పొక్లెయిన్లు ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టిని అక్రమంగా తవ్వి కొత్త ఇళ్ల నిర్మాణాలు, ఇతర అవసరాలకు విక్రయించుకుంటూ అక్రమార్జనకు తెగబడ్డారు. సెలవురోజు వచ్చిందంటే చాలు జిల్లాకేంద్రంలో మట్టి ట్రాక్టర్ల మోత పట్టణవాసులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నది బహిరంగ రహస్యమేనని చెప్పవచ్చు.

భవిష్యత్‌ అవసరాల మాటేమిటి..?

ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులకు అధికారులు అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్‌లో ఇక్కడ గుట్టలు ఉండేవని చెప్పుకొనే పరిస్థితి దాపురించనుంది. అభివృద్ధి పనులకు మట్టి కావాలంటే ప్రైవేట్‌ భూముల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయనే భయాందోళన స్థానికుల్లో లేకపోలేదు.

కొందరు ఇందిరమ్మ కమిటీ సభ్యులమని, ఇళ్ల కోసం మట్టి కావాల్సి ఉందంటూ ఎలాంటి అనుమతి తీసుకోకుండా, అధికారులకు తెలియకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాతో ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ఒకవేళ అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వానికి చెల్లించేది ఒక వంతు ఉంటే.. వందశాతం ఎక్కువ క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలిస్తుంటారు.

గుట్టలు అక్రమంగా తవ్వి మట్టి తరలించడం సరికాదు. సమాచారం ఇస్తే దాడి చేసి చర్యలు తీసుకుంటాం. హాస్టల్‌ భవనానికి మట్టి కావాలంటే కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక సర్వేనంబర్‌ 55లో వెయ్యి టన్నులు (సుమారు 300 ట్రాక్టర్లు) మట్టి తరలింపునకు అనుమతి ఇచ్చాం. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా మట్టి తవ్వకానికి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూశాఖ అధికారులతో సమన్వయంతో దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటాం. – గోవిందరాజులు,

ఏడీ మైనింగ్‌, వనపర్తి

గుట్టుగా మట్టిదందా! 1
1/1

గుట్టుగా మట్టిదందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement