
ఇదీ పరిస్థితి..
బుద్దారం పెద్దచెరువును రూ.22 కోట్లతో 0.098 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి పనులు ప్రారంభించింది. ఈ రిజర్వాయర్‌కు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–8 కాల్వ 16.5 కిలోమీటర్ల వద్ద అల్లీపూర్ సమీపం నుంచి రిజర్వాయర్‌కు నీరు వస్తోంది. బండ్ నిర్మాణానికి 11.57 ఎకరాల భూ సేకరణ చేపట్టగా.. ప్రస్తుతం ఉన్న కట్టను ఆరు మీటర్లు వెడల్పు, కిలోమీటర్ పొడవు నిర్మించనున్నారు. అలాగే 96 ఎకరాలు సేకరించి భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.12.15 లక్షల చొప్పున ఇప్పటికే రైతులకు పరిహారం అందించారు. రిజర్వాయర్‌కు మరో 101 ఎకరాలు అవసరం కాగా.. ఇందుకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం పీఎన్ (ప్రిలిమినరీ నోటిఫికేషన్) పెండింగ్‌లో ఉంది. రూ.18 కోట్లతో 26 కిలోమీటర్ల పొడవునా కుడి కాల్వ నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 14 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సుమారు నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. నిర్మాణం పూర్తయితే 20 వేల ఎకరాలకు అందనుంది. అలాగే ఎడమ కాల్వ 9 కిలోమీటర్లు కాగా ఇప్పటికే నిర్మాణం పూర్తయి పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.