
తప్పెవరిది..?!
●
విచారణ చేపడతాం..
మర్రికుంట ఎఫ్‌టీఎల్ పరిఽధిలోని ప్లాట్ల విషయంపై సోమవారం ప్రజావాణిలో అర్జీ దాఖలైంది. సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. 2012లో ఆయా భూములకు నాలా అనుమతులు ఎలా మంజూరు చేశారనే విషయాన్ని సైతం పరిశీలిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాట్ల ఏర్పాటుకు అనుమతి లభించదు.
– రమేష్‌రెడ్డి, తహసీల్దార్, వనపర్తి
ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములకు నాలా ధ్రువపత్రాలు జారీ చేసిన అధికారులు
వనపర్తి: డబ్బు సంపాదనే ధ్యేయంగా రియల్ వ్యాపారులు.. నజనారాలకు తలొగ్గి అధికారులు అనుమతులు ఇవ్వడంతో చెరువులు, కుంటల్లో విచ్ఛలవిడిగా ప్లాట్లు వెలిశాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వంలో ఎఫ్‌టీఎల్ పరిధి అంటూ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారం కావడం లేదని గతనెల 28న కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లాకేంద్రంలోని మర్రికుంట చెరువు బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తప్పు ఎఫ్‌టీఎల్ పరిధిలోని పట్టాభూములని తెలిసి ప్లాట్లు చేసిన రియల్ వ్యాపారులదా.. లేక ప్లాట్లు చేస్తున్న సమయంలో చూసీచూడనట్లు వ్యవహరించిన నీటిపారుదలశాఖ అధికారులదా.. లేక నాన్ అగ్రికల్చర్ భూమిగా ధ్రువీకరించిన రెవెన్యూ అధికారులదా.. ఎవరిదనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. రూ.వేలు, రూ.లక్షలు ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణ లోపంతో జిల్లాలో ఎంతోమంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మర్రికుంట చెరువు బాధితులేగాక తాళ్ల చెరువు, నల్ల చెరువు, ఈదుల చెరువు, అమ్మచెరువుతో పాటు పలు కుంటల ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూమిలో వెలిసిన వెంచర్లు కోకొల్లలని చెప్పవచ్చు. రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇలాంటి ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలోనే జిల్లాకేంద్రంలోనూ ఓ అధికార బృందాన్ని ఏర్పాటు చేసి కబ్జాకు గురైన చెరువులు, కుంటల్లోని ఆక్రమణలను తొలగించే ప్రయత్నం ఒకసారి నల్లచెరువు సమీపంలో చేసి వదిలేశారు. ఎఫ్‌టీఎల్ భూముల్లో ప్లాట్లు చేస్తున్న సమయంలో నిమ్మకుండా ఉండి ఏళ్ల తర్వాత ఆక్రమణలంటూ అధికారులు చర్యలకు ఉ పక్రమించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాసుల కక్కుర్తితో ఇష్టారీతిన అనుమతులు
రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు
నిర్మాణాలకు అనుమతి లభించక లబోదిబోమంటున్న బాధితులు

తప్పెవరిది..?!