
కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ అదనపు కలెక్టర్
వనపర్తి: కొత్తగా విధుల్లో చేరిన రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.కీమ్యానాయక్ మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ఆ రోజు కలెక్టర్ లేకపోవడంతో మంగళవారం కలిశారు.
ఇద్దరు పుర అధికారుల సస్పెన్షన్
వనపర్తి టౌన్: వనపర్తి పురపాలికలోని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను గుర్తించారని కొన్నిరోజుల కిందట 12 మంది వార్డు అధికారులు, ఓ కీలక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా వార్డు అధికారి శివమ్మ, వార్డు అధికారులకు ఇన్‌చార్జ్‌గా ఉన్న శంకర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఇరువురిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు వద్ద ప్రస్తావించగా దాటవేట వైఖరి ప్రదర్శించారు.
ఐటీఐలో
వాక్–ఇన్ అడ్మిషన్లు
వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు వాక్–ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రమేష్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో సీటు పొందని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని.. కొత్త విద్యార్థులు విధిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఉండాలని పేర్కొన్నారు. పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తునకు ఈ నెల 28 వరకు గడువు ఉందని.. విద్యార్థులు ఏదేని ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో దరఖాస్తు చేసుకొని ప్రింట్ కాపీతో పాటు అన్ని ఒరిజనల్ ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 94902 02037, 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు.
‘అత్యాచార ఘటనలను అరికట్టడంలో విఫలం’
వీపనగండ్ల: మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్రా మహిళా సంఘం) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ఆరోపించారు. జిల్లాకేంద్రంలో ఈ నెల 30, 31న నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అవసరమైన నిధుల కోసం మంగళవారం మండల కేంద్రంలో విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుల దురాహంకార హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస సమాజాన్ని సవాల్ చేస్తున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు పలుకుతూ సామాన్య ప్రజలు, మహిళల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, జిల్లా కార్యవర్గసభ్యురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.