
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కొత్తకోట రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులతో పాటు తగిన వైద్యసిబ్బంది ఉన్నందున ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి గర్భిణుల ఈడీడీ, ప్రసవాల నమోదు, రక్త పరీక్షల రికార్డులను పరిశీలించారు. గత నెలలో పీహెచ్‌సీలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ప్రైవేట్‌లో ఎన్ని జరిగాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జులైలో కేవలం ఒక ప్రసవం జరిగినట్లు తెలుపడంతో కేంద్రంలో ఉన్న వసతులు, సిబ్బందిపై గర్భిణులకు అవగాహన కల్పించి వారికి నమ్మకం కలిగించి ప్రసవాలకు వచ్చేలా చూడాలన్నారు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో వచ్చే రోగులకు రక్త పరీక్షలు విధిగా నిర్వహించాలని, డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. డెంగీ కేసులు నమోదైన చుట్టుపక్కన ప్రదేశాల్లో ఉన్న ఇళ్లలోని వారి రక్త నమూనాలు సేకరించాలన్నారు. కుక్క, పాము కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
నిల్వలు, ధరల పట్టిక ప్రదర్శించాలి..
పెద్దమందడిలోని హాకా ఫార్మర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, ధర వివరాల పట్టికను దుకాణం బయట ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. మండలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు అధికారులను అడిగి తెలుసున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, తహసీల్దార్ సరస్వతి, ప్రోగ్రాం అధికారి డా. మంజుల, మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉన్నారు.