
నేరాల అదుపే ప్రధాన కర్తవ్యం
వనపర్తి: జిల్లాలో నేరాలను అదుపు చేయడమే ప్రధాన కర్తవ్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సందర్శిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఏ నేరాలు పెరిగాయి.. వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్ఛయంతో పని చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేసుల దర్యాప్తునకు సంబంధించి ఎస్సైలకు తగిన సూచనలు ఇవ్వాలని డీఎస్పీ, సీఐలను ఆదేశించారు. మహిళల భద్రతే లక్ష్యంగా పని చేయాలని, మహిళలు, చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని.. డ్రంకెన్ డ్రైవ్, వాహన తనిఖీలు నిరంతరం చేపట్టాలని కోరారు. గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని.. నిర్వాహకులతో ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలని ఎస్‌ఐ, సీఐలకు సూచించారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ముందుగానే చెప్పాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని.. గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీషీట్స్ తెరవాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలుపై నిఘా ఉంచాలని, జిల్లా, రాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చే గంజాయి మూలాలు, కీలక వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించారు. నేర సమీక్షలో డీఎస్పీ జె.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, శివకుమార్, సీసీఎస్ సీఐ రవిపాల్, కొత్తకోట ఇన్‌చార్జ్ సీఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నేర సమీక్షలో
ఎస్పీ రావుల గిరిధర్