
మత రాజకీయం దేశ ప్రగతికి విఘాతం
ఆత్మకూర్: మత రాజకీయాలు దేశ ప్రగతికి విఘాతమని.. భారత రాజ్యాంగంలో లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిస్టు అంశాల తొలగింపు అంటూ రాజ్యాంగ పీఠికకు ఉరితాడు పేనితే మోదీ సర్కార్‌కు పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో సీపీఐ జిల్లా మూడో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి పాత విద్యుత్ కార్యాలయం, గాంధీచౌరస్తా, బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను ఆర్థిక నేరగాళ్లకు దోచిపెడుతూ లూటీ చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణల పేరుతో ప్రజల మధ్య మత విధ్వేషాలకు ఆజ్యం పోస్తూ సంఘ్ పరివార్ శక్తుల ఎజెండాను పాలన రంగంలో జొప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే కుట్ర బాధాకరమన్నారు. కమ్యూనిస్ట్‌లు ఎల్లప్పుడు జనం పక్షాన నిలబడి సమస్యల సాధనకు పోరాటం చేస్తారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. జనం పక్షాన పోరాడుతున్న సీపీఐకి వందేళ్లు నిండాయన్నారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసేందుకు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కళావతమ్మ, శ్రీహరి, శ్రీరామ్, మోషా, అబ్రహం, నర్సింహ శెట్టి, గోపాలకృష్ణ, చంద్రయ్య, భాస్కర్, కుతుబ్, శాంతయ్య, ప్రజాకవి జనజ్వాల, గంధం నాగరాజు, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం జోలికొస్తే మోదీ సర్కార్‌కు పుట్టగతులుండవు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ