
కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీకి పూర్వ వైభవం
వనపర్తిటౌన్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటవైపు నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. 2023, డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహిళలను సన్మానించి మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారం పొంది ఆర్టీసీని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మహిళలు ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత సాధించేందుకు మహాలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 2023, డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగించారని, ఇందుకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ.6,680 కోట్లు విడతల వారీగా చెల్లించిందని తెలిపారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే 2.35 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని పేర్కొన్నారు. జిల్లాకు 10 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయని, త్వరలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాను సందర్శించి బస్సులను ప్రారంభించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, డిపో అధికారులు తదితరులు పాల్గొన్నారు.