
మున్సిపల్ వాహనాలకు రోడ్లే దిక్కు!
● వనపర్తి పురపాలికలో పార్కింగ్ స్థలం కరువు
● చెత్త సేకరణ ట్రాక్టర్లు,వాటర్ ట్యాంకర్లు, ఇతర వాహనాలు రోడ్లపైనే నిలిపివేత
● ప్రతిపాదనలకే పరిమితమైన స్థలం కేటాయింపు
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీ వాహనాల పార్కింగ్‌కు స్థలం కరువైంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలుచేసిన మున్సిపల్ వాహనాలు నిలిపేందుకు రోడ్లే దిక్కయ్యాయి. పురపాలికలో ఎక్కడైనా పార్కింగ్ సమస్య ఉంటే అధికారులే ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ మున్సిపాలిటీ వాహనాల పార్కింగ్ సమస్య కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా వాహనాలకు భద్రత లేకుండా పోతోంది. వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ కోసం 14 ట్రాక్టర్లు, మూడు ఆటోలతో పాటు రెండు ప్రొక్లెయిన్లు, రెండు వైకుంఠ రథాలు, రెండు వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ట్రాక్టర్లు, ఆటోలద్వారా చెత్తను సేకరించిన అనంతరం వాటిని రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. మిగతా వాహనాలను సైతం ఎక్కడబడితే అక్కడే నిలిపివేస్తున్నారు.
భద్రత కరువు..
రోడ్లపైన నిలుపుతున్న వాహనాలకు తరచుగా మరమ్మతులు తప్పడం లేదు. వాహనాలకు సంబంధించి కేబుల్ వైర్లు, ఇతర సామగ్రి చోరీకి గురవుతున్నాయి. వాటిని రీప్లేస్‌మెంట్ చేసేందుకు మున్సిపాలిటీ నిధులను భారీగా వెచ్చించాల్సి వస్తోంది. వాహనాల్లోని ఇంధనం సైతం చోరీకి గురవుతుందని తెలుస్తోంది. దీనికి తోడు వాహనాలకు నీడ సౌకర్యం లేకుండా పోవడంతో వాటి సామర్థ్యం తగ్గడంతో పాటు పలు పరికరాలు పాడైపోతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. అయితే కొన్ని వాహనాలకు మంటలు చెలరేగి పాడైపోయిన ఉదంతాలు ఉన్నాయి. 2020లో రహదారులను శుభ్రం చేసేందుకు రూ. 62లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేయగా.. ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. అయితే మున్సిపల్ వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం అవసరమని గుర్తించిన జిల్లా మొదటి కలెక్టర్ శ్వేతా మహంతి.. ప్రస్తుత పుర కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలోని చౌడేశ్వరి ఆలయ సమీపంలో ఎకరా స్థలం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తదనంతరం ఆమె బదిలీ కావడంతో ప్రతిపాదించిన స్థలాన్ని పార్కింగ్‌కు మలుచుకునేందుకు ఏ అధికారి ప్రయత్నం చేయకపోవడంతో వనపర్తి మున్సిపాలిటీ వాహనాలకు పార్కింగ్ సమస్య తీరనిలోటుగా మారింది.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
మున్సిపల్ వాహనాల పార్కింగ్‌కు కార్యాలయ ఆవరణలో స్థలం లేని మాట వాస్తవమే. గతంలో ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయో తెలుసుకొని మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉంటే వాటి భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు.
– ఎన్.వెంకటేశ్వర్లు,
మున్సిపల్ కమిషనర్, వనపర్తి

మున్సిపల్ వాహనాలకు రోడ్లే దిక్కు!