
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
కొత్తకోట: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలు, ఈడీడీ రిజిస్టర్లు, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పురపాలికలో ఫ్రై డే–డ్రై డేను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణుల ఏఎన్‌సీ నమోదు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రసవం రోజులు దగ్గర పడినప్పుడు ఆశా వర్కర్లు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లు, అబార్షన్లపై దృష్టి సారించి నియంత్రించాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్తకోటలో గతేడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని.. ఈ ఏడాది వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల ఆవరణల్లో నీటి నిల్వ లేకుండా, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కొత్తకోటలో బస్తీ దవాఖాన ఏర్పాటుకు భవనం చూడాలని పుర కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశించారు.
పెట్రోల్‌బంక్ ఏర్పాటుకు స్థల పరిశీలన..
కొత్తకోట రూరల్: మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకుగాను కొత్తకోట–పెబ్బేరు జాతీయ రహదారి మిరాసిపల్లి వద్ద స్థలాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పరిశీలించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయిస్తున్నందున జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని డీఆర్డీఓ ఉమాదేవిని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో
ప్రసవాల సంఖ్య పెంచాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి