
‘రామన్నగట్టు’ నిర్మాణంపై పోరాటం
పాన్‌గల్: మండలంలోని కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంపై రైతులతో కలిసి పోరాటం చేస్తామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మండలస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంతో పాటు వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించే రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని.. బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయకుండా మంత్రి జూపల్లి రద్దు చేయిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి కాల్వలో పేరుకుపోయిన జమ్మును రైతులే స్వయంగా తొలగించుకుంటున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామాల్లోని రచ్చకట్టల వద్ద ప్రభుత్వ హామీలపై ప్రజలతో చర్చించాలన్నారు. మండలంలోని చాలా గ్రామాల బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని.. ఇది సరికాదని, మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటూ వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. అనంతరం పార్టీ మండల కన్వీనర్‌గా కిష్టాపూర్‌కు చెందిన వీరసాగర్, కో–కన్వీనర్‌గా చింతకుంటకు చెందిన తిలకేశ్వర్‌గౌడు, కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన భాస్కర్‌రెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌నాయక్, అడ్వొకేట్ రవికుమార్, సరోజమ్మ, సుధాకర్‌యాదవ్, జ్యోతినందన్‌రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.