
‘క్షయ’ మరణాలను నియంత్రించాలి
వనపర్తి: క్షయను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని.. అవసరం ఉన్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 408 మంది క్షయ బారినపడగా.. 12 మంది మృతి చెందారని చెప్పారు. ఇక మీదట ఏ ఒక్కరూ చనిపోవడానికి వీలులేదని, పీహెచ్‌సీల్లో వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కంటిచూపు సమస్యలతో బాధపడుకున్న వారిని కంటివెలుగు ద్వారా గుర్తించామని.. ఆశా కార్యకర్తలు ఆ జాబితా నుంచి ఐదుగురిని ఎంపికచేసి పరీక్షించి అవసరం ఉన్న వారికి ఉచితంగా శస్త్రచికిత్స చేయించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల్లోని వంట కార్మికులకు వైడల్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే వారం పాటు క్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసరం అయినప్పుడు వెంటనే వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, అధికారులు డా. సాయినాథ్‌రెడ్డి, డా. పరిమళ, డా. చైతన్య, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.