
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● వర్షాల నేపథ్యంలో
ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి సాగునీటి లభ్యత, రైతులకు ఎరువుల పంపిణీ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్యం, డ్రై డే కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే బాధితులకు అండగా నిలవాలన్నారు. ముఖ్యంగా గిరిజన అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. ఈ నెల 25నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు మండలాల వారీగా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారికి సూచించారు. అదే విధంగా ఎరువుల దుకాణాల్లో స్టాక్ వివరాలు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వ్యవసాయానికి అవసరం మేరకు నీటిని విడుదల చేసే విధంగా వ్యవసాయ, నీటిపారుదలశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ముందస్తు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. విపత్తు నిర్వహణకు సంబంధించి మాక్ డ్రిల్ ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వరదలకు సంబంధించి రోజు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.