
దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచండి
వనపర్తి: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆగష్టు 15 నాటికి ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు అవసరమైన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. చాలా దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్‌లోనే పరిష్కరించవచ్చని చెప్పారు. మిగిలిన వాటిని ప్రాధాన్యత క్రమంలో ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్‌కు పంపించాలన్నారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి ఉంటే స్పీకింగ్ ఆర్డర్ ద్వారా తిరస్కరించి దరఖాస్తుదారుకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియ వేగవంతం చేయాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం కొరకు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఏఓ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.