
పీఏఐ పకడ్బందీగా పూర్తి చేయాలి
వనపర్తి: కేంద్రానికి 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామపంచాయతీల అభివృద్ధి సూచిక (పీఏఐ) వివరాలు పంపించాల్సి ఉంటుందని.. పకడ్బందీగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఈ అంశంపై సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి నిర్దేశించిన 9 విభాగాల్లో 147 ఇండికేటర్స్‌ను పూర్తి చేసి గ్రామపంచాయతీల వారీగా పంపించాలని సూచించారు. ఇండికేటర్స్ వివరాలను సేకరించి ఎంపీడీఓల లాగిన్ నుంచి పంపించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, ముఖ్య ప్రణాళిక అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.